- కొత్తగా చేరిన 28.99లక్షల వినియోగదారులు
- జియో కంటే మెరుగైన ఫలితం
- ట్రాయ్ ఆగస్టు నివేదిక వివరాలు ఇవీ..
కొత్త వినియోగారులను పెంచుకునే విషయంలో దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్.. ఈ ఏడాది దూసుకుపోతోంది. 2020 ఆగస్టు నెలలో జియో కంటే ఎక్కువ మంది సభ్యులను చేర్చుకోగలిగింది. ఈ విషయం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఎయిర్‌టెల్ 28.99 లక్షల మంది సభ్యులను చేర్చుకోగా, జియో 18.64 లక్షల మంది సభ్యుల చేరికలతో గణనీయంగా వెనుకబడి ఉంది. మరోవైపు వి (వోడాఫోన్ ఐడియా) ఆగస్టు నెలలో తిరోగమన దిశలో సాగింది. అది 12.28 లక్షల క్షీణతతో చందాదారులను కోల్పోయింది. వైర్‌లెస్ టెలికాం మార్కెట్‌లో 35.08 శాతం మార్కెట్ వాటాతో రిలయన్స్ జియో దేశంలో అత్యధిక వాటాతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా ఎయిర్‌టెల్ 28.12 శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో నిలిచింది.
మొత్తం వైర్‌లెస్ చందాదారులు 114.792 కోట్లు
ట్రాయ్ నివేదిక ప్రకారం.. మొత్తం వైర్‌లెస్ చందాదారులు జూలై చివరిలో 114.418 కోట్ల నుంచి ఆగస్టు చివరి నాటికి 114.792 కోట్లకు పెరిగింది. తద్వారా నెలవారీ వృద్ధి రేటు 0.33 శాతం నమోదైందని వెల్లడించారు. జూలైతో పోల్చినప్పుడు రిలయన్స్ జియో చందాదారుల చేరికలు ఆగస్టులో గణనీయంగా తగ్గాయి. ఇది వరుసగా 35.54 లక్షల నుంచి 18.64 లక్షలకు పడిపోయింది.
జూలైలో జియో పనితీరుతో పోల్చినప్పుడు.. ఎయిర్టెల్ ఆగస్టు నెలలో 32.60 లక్షల నుంచి 28.99 లక్షలకు చందాదారుల చేరికలను తగ్గించింది. అయితే, ఆగస్టులో జియో ప్రదర్శన కంటే ఇది చాలా ఎక్కువ. ఖచ్చితంగా చెప్పాలంటే, ఎయిర్‌టెల్ ఈ నెలలో జియో కంటే 10.35 లక్షల మంది సభ్యులను చేర్చింది.
వెనుకబడిపోతున్న వీఐ
ఇక వీఐ (వోడాఫోన్ ఐడియా) సుమారు 12.28 లక్షల మంది సభ్యులను కోల్పోయింది. అయితే. జూలై నెలలో కోల్పోయిన 37.26 లక్షల మంది సభ్యుల కంటే చాలా తక్కువ. దీనిని బట్టి వీఐ తన చందాదారుల సంఖ్య కోల్పోయే శాతాన్ని తగ్గించుకున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే బిఎస్‌ఎన్‌ఎల్ ఆగస్టు నెలలో 2.14 లక్షల మంది సభ్యులు కొత్తగా చేరారు. వైర్‌లెస్ చందాదారులలో ఎయిర్‌టెల్ నెలవారీ వృద్ధి రేటు 0.91 శాతం ఉండగా, జియో 0.47 శాతం వృద్ధి రేటుతో వెనుకబడి ఉంది. TRAI ప్రకారం, కోల్‌కతా మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలు ఆగస్టు నెలలో వైర్‌లెస్ చందాదారుల స్థావరంలో గరిష్టంగా 1.13 శాతం వృద్ధిని చూపించాయి.
బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల వివరాలు..
బ్రాడ్‌బ్యాండ్ విషయానికొస్తే ట్రాయ్ నివేదిక ఆగస్టు చివరినాటికి బిఎస్‌ఎన్‌ఎల్ 78.5 లక్షల మంది సభ్యులను కలిగి ఉందని వెల్లడించింది. భారతి ఎయిర్‌టెల్ 25.3 లక్షల మంది సభ్యులతో రెండవ స్థానంలో, ఆతర్వాత అట్రియా కన్వర్జెన్స్ 17 లక్షల మంది సభ్యులు, జియో 12.5 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇక వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో, జియో 40.267 కోట్ల మంది సభ్యులతో అగ్రస్థానంలో ఉంది. ఎయిర్‌టెల్ 15.465 కోట్ల మంది వినియోగదారులు, వీఐ (వోడాఫోన్ ఐడియా) 11.991 కోట్ల మంది వినియోగదారులు, బిఎస్‌ఎన్‌ఎల్ 159 లక్షల మంది సభ్యులు ఉన్నారు.
----------------------------------------



0 Comments